ఇక నుంచి నేను దేశీపండితుడను

నేను ఇక్కడ బ్లాగడం మొదలుపెట్టిన కొన్ని రోజులకు ఇస్మాయిల్ గారు desipundit లో చేరమని సలహా ఇవ్వడంతో అక్కడచేరి అక్కడ్నుంచి మన తెలుగు బ్లాగులకు ప్రచారం కల్పిస్తున్నాను కనుక ఇక నుంచి అక్కడ్నుంచే కొత్త వ్యాసాలు, బ్లాగుల గురించి చదవండి.

Advertisements

ఈ రోజు బ్లాగు – మూవీమేళా

 తేది: ఆగష్టు8, 2007

చిరునామా:http://moviemela.blogspot.com

గురించి:Celebrating The Cinema

సొంతదారు: సినీ అభిమాని(?)

విశ్లేషణ: youtube,google videos లోనూ upload చేసిన తెలుగు సినిమాలను ఒక దగ్గర చేర్చి తెలుగు సినిమాలు చూడాలనుకున్నవారికి మంచి సౌకర్యం కలుగచేస్తున్నారు ఈ బ్లాగు మొదలుపెట్టిన ఒక సినీ వీరాభిమాని. పైరసీ అంటే నచ్చని వారు ఈ సైటు దగ్గరకు కూడా రావద్దని వారు ముందే మనవి చేస్తున్నారు. పైరసీ సంగతి పక్కన బెడితే మంచి క్వాలిటి ప్రింట్ సినిమాలే చూస్తాననుకునే వాళ్ళు కూడా ఈ సైటుకు దూరంగా వుండడం మంచిది. ఈ మధ్య ఇట్లాంటి బ్లాగులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. వీరందరి టార్గెట్ ఎక్కువ విజిటర్స్ ను తమ బ్లాగు వైపుగా ఆకర్షించి తద్వార google ads ద్వారా కొద్దో గొప్పో సొమ్ము చేసుకోవాలని ఆరాటం. కానీ ఈ బ్లాగు వారు అలాంటి పని కూడా చేయటం లేదు. మరి ఈ బ్లాగు స్థాపన కేవలం సమాజ సేవేనేమో!

చదవాల్సినవి:ఇందులో చదవాల్సింది ఏమీలేదు. అలాగే ఈ బ్లాగులో ఇచ్చిన సినిమా లింకుల్ల్లో పెద్దగా చూడాలసిన సినిమాలు కూడా ఏమీ లేవు.

చివరిమాట: అసలీ బ్లాగు తెలుగును బ్లాగు అనడం తప్పు. ఇది తెలుగు సినిమాలు చూడాలనుకునే వారికోసం కావలసిన సమాచారం కలిగిన ఒక ఇంగ్లీషు బ్లాగు.

ఈ రోజు బ్లాగు – జగన్నాటకం

తేదీ: ఆగష్టు 06, 2007

చిరునామా:http://jagannaatakam.blogspot.com

గురించి:ఈ బ్లాగు సొంతదారులు తమ గురించి ఏమీ చెప్పుకోలేదు., “ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు…అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి…” అని తప్ప.

సొంతదారు: ఈ బ్లాగు సొంతదారు ఎవరో కూడా పాఠకులకు తెలియచేయలేదు. కానీ బ్లాగులోని పోస్టులు చూస్తే మాత్రం ఇది ఒక్కరు చేస్తున్న పని కాదని అర్థమవుతుంది.జ్యోతి, త్రివిక్రం, శొధన అనే ముగ్గురు రచయితలు ఈ బ్లాగులో వ్యాసాలు రాస్తున్నరు.

విశ్లేషణ: బ్లాగు పేరు జగన్నాటకం అని చూస్తేనే అర్థమవుతుంది, ఇది పురాణాలను పుక్కిట పట్టిన వారెవరో రాస్తున్నారని. మన పురాణాల్లో వున్నన్ని పాత్రలు వేరే ఎక్కడ వుండవని మనకు తెలుసు. మన పురాణాలకున్న ప్రత్యేకత ఏంటంటే ఇందులోని ప్రతి చిన్న పాత్రకు కూడా ఒక back story వుంటుంది. సాధారణంగా మనకి భారతం, రామాయణాల్లోని ముఖ్య కథ తెలిసి వుంటుంది కానీ అందులోని పాత్రల వెనుక కథ అందరికీ తెలియక పోవచ్చు. ఉదాహరణకు భీష్ముడు శిఖండి వలన మరణం చెందాడని తెలుసు కానీ శిఖండి కథ చాలా మందికి తెలియదు. అలాగే కర్ణునికి వివిధ శాపాలున్నాయని తెలుసు గానీ ఆ శాపాలన్నీ ఎలా వచ్చాయి అన్న విషయాలు తెలియకపోవచ్చు. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ బ్లాగు సందర్శించడం ద్వారా చాలా తెలుసుకోవచ్చు.

చదవాల్సినవి:ఈ బ్లాగు మొదలుపెట్టి 6 నెలలయినప్పటికీ ఇందులో కేవలం పది పోస్టులే వున్నాయి. అన్ని పోస్టూలు తప్పకుండా చదవాల్సినవే! ఇందులో వున్న స్ఫూర్తి – సమయస్ఫూర్తి కథ చదువుతుంటే ఈ మధ్య మేనేజెమెంట్ వాళ్ళ కోసం వస్తున్న Who moved my cheese, Fish tales లాంటి పుస్తకాల్లోని కథలు గుర్తొచ్చాయి. జనాలు ఎగబడి ఆ పుస్తకాలు కొనడంకంటే మన పురాణల్లో ఎన్నో కథలను చదివి నేర్చుకోవలిసింది చాలా వుందనడానికి ఈ కథ ఉత్తమ ఉదాహరణ.

చివరిమాట:పురాణాల్లోని వివిధ కథలను పాఠకులకు అందచేసే మంచి ప్రయత్నంతో మొదలుపెట్టిన ఈ బ్లాగు ఇంకా ఎక్కువ కథలతో, వ్యాసాలతో అబివృధ్ధి చెందితే ఎంతో బావుంటుంది.

ఈ రోజు బ్లాగు – నువ్వుశెట్టి

తేది: ఆగష్టు 3, 2007చిరునామా: http://nuvvusetty.wordpress.com/

గురించి: తెలుగు అక్షరవర్ణమాలలో
యాభై ఆరు సౌగంధాలను,
ఎప్పటినుంచో
అటూ ఇటూ మారుస్తూ
ఆశగాఉన్నా
ఎప్పటికైనా రాకపొతుందా …
నలుగురు మెచ్చే
ఓ నవకవితా భావమాలిక
నాకొసం అని……
అప్పటి దాకా ఇలా…..

సొంతదారు: నువ్వుశెట్టి సోదరులు(?)

విశ్లేషణ: చందన, బొమ్మన బ్రదర్స్ సంగతి అందరికీ తెలుసు. మరి నువ్వుశెట్టి బ్రదర్స్ తెలుసా మీకు? తెలియకపోతే మీరు బ్లాగు లోకానికి కొత్త అయ్యి వుండవచ్చు. బ్లాగులోకానికి కాస్తా ఆలస్యంగా వచ్చినా ఆలోచించేలా రాస్తున్న ఈ బ్లాగు లో తప్పక చదవాల్సినవి కృకీలు. (అంటే ఏమిటో నాకు తెలియదు, జపనీస్ హైకూలాగా ఈ కృకీలు కూడా ఒక విధమైన నవ కవనమేమో.)

“శ్రామికుడు భావకుడైతే,
మరలు సైతం మంద్ర స్వరాలవుతాయి.
భావానికి ఆకలివేస్తే ,
అక్షరాలు సైతం మరఫిరంగులవుతాయి.” అని వీరు రాసిన ఒక కృకీ అధ్బుతం.ఇదొక్కటే కాదు ఇలాంటివి చాలానే వున్నాయి వీరి బ్లాగిలో. కృకీలేకాకుండా “భావాలమాల”, “చిక్కు ముడులు “, “బోసి నవ్వులు ” లాంటి వివిధ వర్గాలలో కవితలు, కథలు, పొడుపుకథలు రాస్తున్న వీరి బ్లాగు ఆసక్తి కలిగించేలావుంది. పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి వీరందించిన ఉదంతం చాలాబావుంది. బాగా రాస్తున్నారు కబట్టి ఇంకా బాగా ఎక్కువ వ్యాసాలు రాసి మన తెలుగు వెలుగులు అంత్ర్జాలంలో ప్రకాశింపచేయాలని విజ్ఞప్తి. మంచి బ్లాగు అందరూ చూడ దగ్గ బ్లాగు.

చదవాల్సినవి: మనసులో మాట వరగం క్రింద వీరు రాసిన మూడూ కథలు “ఈగ ఆత్మ కథ”, “మృగరాజు నవ్వుతుంది…..”, “పాత చేపా ..కొత్త చీమ..!” తప్పక చదవాల్సినవి. అన్ని కథల్లోనూ జంతువులే ముఖ్య పాత్ర వహిస్తాయి. కానీ కథంతా చదివాక చురక మాత్రం మనుషులకే తగలడం ఈ కథల పత్యేకత.

“మృగరాజు నవ్వుతుంది…..” కథైతే George Orwell నవల్ Animal farm ను జ్ఞప్తికి తెచ్చింది.

చివరిమాట:బ్లాగు టైటిల్ లో నువ్వుశెట్టి బ్రదర్స్ అంటూన్నారు, “స్వగతం” లో నేమో “నా కోశం” అంటున్నారు. కొంచెం కన్‌ఫ్యూజింగ్ గా వుంది.ఇంతకీ ఈ నువ్వు శెట్టి బ్రదర్స్ ఒక్కరా? ఇద్దరా?

ఈరోజు బ్లాగు – తెలుగుదనం

తేది: ఆగష్టు 2, 2007చిరునామా:http://telugudanam-blog.blogspot.com

గురించి:తెలుగు బిడ్డలందరినీ “తెలుగుదనం” సాదరంగా అహ్వానిస్తుంది. తేనెలొలికే తెలుగు భాషకు మావంతు సేవ ఈ “తెలుగుదనం”.ఎక్కడెక్కడో వున్నా తెలుగుపై మక్కువ తీరని తెలుగు బిడ్డలకోసం ఈ “తెలుగుదనం”.తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుంది ఈ “తెలుగుదనం”.’మన సంస్కృతినీ, సాంప్రదాయాలను గుర్తుచేసుకుందాం, నలుగురితో పంచుకుందాం,’ అనుకునేవారికీ “తెలుగుదనం”.వంటలు, సౌందర్యం, చిట్కాల వంటి సంగతులతో మన తెలుగింటి ఆడపడుచులకు అండగా వుంటుంది ఈ “తెలుగుదనం”. తెలుగు భాషాభిమానులకోసం, “తెలుగుదనం” సందర్శకులకోసం, వారం వారం “తెలుగుదనం”లో జతచేసే క్రొత్త విషయాలను ఇక్కడ ప్రకటిస్తున్నాము. రండి, చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి.

సొంతదారు: మురళీ కృష్ణ వలివేటి

విశ్లేషణ: ఈ బ్లాగు గురించి పైన పేర్కొన్నట్టుగా వంటల దగ్గర్నుంచి మెదలెట్టి, పండుగలు, చిట్కాలు, తెలుగు భాష గురించిన విషయాలు, సామెతలు, సూక్తులతో కూడిన ఈ బ్లాగు, మొదట్లో చూడగానే వర్గీకరణ లేకుండా వివిధ అంశాలను ప్రచురించి చదవడానికి కష్టమనిపించినా ఆ తర్వాత ఇది http://www.telugudanam.co.in అనే సైటుకు అనుబంధంగా నడుస్తోదని తెలిసి కుదుట పడ్డాను. ఆ సైటులో ప్రచురమవుతున్న కొత్త వ్యాసాలను ఈ బ్లాగులో కూడా ప్రచురిస్తున్నారు. అక్కడ ఇప్పటికే ఒక సైటు వుందిగా మళ్ళీ ఇక్కడ ఎందుకు ప్రచురించడం అనే అనుమానమొచ్చినా కొత్త వ్యాసాలను పాఠకుల సౌకర్యార్థం వారి బ్లాగులో ప్రచిరించడం మంచి ఆలోచనే! కానీ అనవసరంగా bandwidth వృధా చేయడం ఎందుకు, రెండింతల శ్రమ ఎందుకు అనిపిస్తే మాత్రం వారి సైటులోని ఆయా వర్గాల క్రింద new new అని మెరిసిపోయేలా ఈ కొత్త వ్యాసాలకు లింకులు కలిపితే సరిపోతుందని నా అభిప్రాయం. (ఆ పని ఇప్పటికే చేస్తున్నరు కానీ ఇంకా బాగా క్రమపరచవచ్చని అభిప్రాయం).

చదవాల్సినవి: ఈ బ్లాగు చదవడంకంటే వివిధ అంశాలతో కూడిన సైటు చదవడం మేలు. కాకపోతే ఎప్పటికప్పుడు ప్రచిరించే కొత్త అంశాలపై ఒక కన్నేసి వుండాలంటే మాత్రం ఈ బ్లాగుని నిరంతరం వీక్షించాల్సిందే! కవితల వర్గంలో కొన్ని కవితలే వున్నప్పటికీ కవితలు బానే వున్నాయి.

వీరే నడుపుతున్న సైటు www.telugudanam.co.in లో వ్యాకరణం వర్గంలో కానీ లేదా ఇతర వర్గాలలో కానీ ఇంకా ఎక్కువ వ్యాసాలు చేరిస్తే బావుంటుంది. ఉదాహరణకు పర్యాయ పదాలు అన్న అంశం కింద ఒక 80 పదాలు మాత్రమే ఇచ్చారు. ఈ సంఖ్య ఇంకా పెరగాలి, అప్పుడే పాఠకులకు వుపయోగం. అలాగే కథలు కూడా ప్రచురిస్తే బావుంటుంది. ఇందులోని వ్యాసాలన్నీ ఎవరు రాస్తున్నరో కూడా ప్రచురిస్తే బావుంటుంది. ఒక వేళ ఈ వ్యాసాలన్నీ మురళికృష్ణ గారే రాసుంటే క్షమించాలి.

చివరిమాట: తెలుగు వారి కోసం ప్రత్యేకంగా మొదలుపెట్టిన ఈ సైటు/బ్లాగు ప్రతి రోజు కొత్త వ్యాసాలతో ఇంకా బాగా అబివృధ్ధి చెంది తెలుగు వారి అవసరాలకు one stop site గా వెలుగొందాలని ఆకాంక్ష!

ఈరోజు బ్లాగు – తెలుగు కార్టూన్స్

తేదీ:ఆగష్టు 1, 2007చిరునామా:http://telugu-cartoons.blogspot.com/

గురించి: తెలుగు కార్టూన్స్

సొంతదారు: గౌరీ కుమార్

విశ్లేషణ: ఈనాడు వార్తాపత్రికలో శ్రీధర్ కార్టున్స్ సంగతి తెలియని తెలుగు వాడెవరైనా వుంటారా? తెలియని వాళ్ళు ఈనాడు వెబ్సైటు సందర్శించడం ద్వారా లేకపోతే గౌరీకుమారుని బ్లాగును దర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. దాదాపు 6 నెలల క్రితం (ఫిబ్రవరిలో) ఈ బ్లాగును మొదలుపెట్టినా ఈ మధ్యనే బాగా ఊపందుకున్నటుంది. జులైలో దాదాపుగా ప్రతిరోజూ ఈనాడులో వచ్చిన కార్టున్ ని ఆయన బ్లాగులో పెట్టేశారు గౌరీ.

ఈయనే www.gowrikumar.com అనే పేరుతో మరో సైటుని కూడా నడుపుతున్నారు. అందులో సుమతీ శతకము, శ్రీ శ్రీ మహాప్రస్థానం, భగవధ్గీత ల నుండి కొన్ని అంశాలను ప్రచురింహ్చడమే కాకుండా, C భాషకు చెందిన ఇంటర్వ్యూ ప్రశ్నలు, చిట్కాలు కూడా ప్రచిరించారు. కానీ ఈ విషయాలన్నీ ఇప్పటికే వేరే సైటలో లభ్యమవుతున్న కారణంగా మరోసారి వాటినే ప్రచురించడం ద్వారా bandwidth వృధా అవుతుందేమో కదా -)

చదవాల్సినవి:అన్నీ (ఇప్పటికే మీరు శ్రీధర్ కార్టూన్లు ఈనాడు లో చూడనట్టయితే)

చివరిమాట:ఈనాడు వారి కార్టున్ లు తన బ్లాగులో పెట్టి అన్నింటినీ ఒక దగ్గర చేర్చడం ఫర్వాలేదు కానీ, కార్టున్ లంటే ఆసక్తి వున్న గౌరీ సొంతగా కూడా ఏవైనా కార్టూన్లు వేస్తే బావుంటుందేమో కదా!అలాగే సొంతగా ఏమైనా రాస్తే బావుంటుందని ఉచిత సలహా.

కొత్త శీర్షిక – Blog of The Day

తెలుగులో ఈమధ్యన చాలామంది బ్లాగులు రాస్తున్న సంగతి ఇక్కడ వరకూ చేరిన మీకు ఈ పాటికే తెలిసి వుంటుంది. మొదట్లో పది పదిహేను మంది బ్లాగరులు వున్నప్పుడూ అందరి వ్యాసాలను చదివి వ్యాఖ్యలు చేసే అవకాశం వుండేది. కానీ నేడు షుమారు 500లకు చేరుకున్న తెలుగు బ్లాగులు అన్నీ ఒకే సారి చదవడం కష్టమైపోతుంది చాలామందికి. కూడలి, తేనెగూడు, తెలుగుబ్లాగర్స్, జల్లెడ లాంటి సైట్లు బ్లాగులన్నింటినీ ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నాలు చేయడం ఆనందదాయకం. ఇటువంతి ప్రయత్నాల్లో భాగంగానే నేను TBOD(Telugu Blog Of The Day) మొదలు పెట్టడం జరిగింది.ఇక్కడ ప్రతిరోజూ ఒక్కో తెలుగు బ్లాగు గురించి విశ్లేషిస్తూ, ఆయా బ్లాగుల్లోని ప్రాచుర్యం పొందిన మరియు ఆసక్తి కరమైన విష్యాలను క్లుప్తంగా తెలియచేయాలనేదే నా ఈ ప్రయత్నం. వున్న బ్లాగులన్నింటిలోనూ ఏది ముందుగా విశ్లేషించాలి, ఏది తర్వాత విశ్లేషించాలి అన్నది కష్టమైన ప్రశ్నే! అందుకు నేను పాటిస్తున్న నియమావళి ఇది.

1)కూడలి తెరవుట.

2)అందులో మొదటిగా లిస్టు అయ్యివున్న బ్లాగును విశ్లేషించుట.

3)ఆ బ్లాగు ఇప్పటికే విశ్లేషించబడినదయితే, లిస్టులోని రెండో బ్లాగుని విశ్లేషించుట.

4)ఒకవేళ అదీ విశ్లేషించబడిన బ్లాగయితే తరువాతి బ్లాగుని విశ్లేషించుట.

5)నాలుగో నియమం చూడుట.

మీ బ్లాగు ఎప్పుడోకప్పుడు తప్పకుండా వస్తుంది, ఎదురుచూడండి.